Monday, October 23, 2017

తల్లడిల్లి దివాలీ ఆయె దీపావళి!

ఇంటను వెలిగే  కళికల కాంతులు 
మింటను మెరిసే చుక్కలతో పోయె వంతులు
కళికల గాంచి మురిసె దీపావళి!   

దీప ఆవళుల తోరణ జిగినీ
మిలమిలలాడుత ధరించె రజని
తోరణపు దివ్వెల మెరిసె దీపావళి!

దివాలా నీడ  సోకని  దీపావళి
ళ-కారం జాడ దొరకని తెలుగులో
తల్లడిల్లి దివాలీ ఆయె దీపావళి!


7 comments:


  1. తల్లీ ! డిల్లీ పాయే !
    మళ్ళీ దీపావళీయమట కారణమౌ :)
    విల్లన్లయ్యిరి సుమ్మీ
    రిల్లములన్ ద్రుంచుచు మన రిబ్బుడు జనులున్ :)

    జిలేబి

    ReplyDelete
  2. దివాలీలు, పొంగళ్ళు తెలుగు వారికి మోజు కదా పన్నారి గారు.
    కొన్ని ఇ-గ్రీటింగ్ కార్డ్ ల్లో హిందీలో కూడా "దీపావళి" అనే వ్రాసుండడం చూశాను. మరి ఈ దివాలీ అనే పదం ఎక్కడ, ఎప్పుడు పుట్టిందో ఏమిటో?
    సంక్రాంతి సమయంలో 'హేపీ పొంగల్' అని సాటి తెలుగువారికి కూడా చెప్పడం కొందరు తెలుగువారికి ఫేషన్ లాగా అయిపోయింది. నాకెవరన్నా తెలుగువారు అలా చెబితే పొంగల్ కాదు, సంక్రాంతి అనండి అని ఏమీ మొహమాట పడకుండా చెప్పేస్తుంటాను.
    "ళ-కారం జాడ దొరకని తెలుగులో ...." అని బాగా అన్నారు. ఈ రోజుల్లో చాలా మంది 'పెల్లి'కి 'వెల్లి' వస్తుంటారు. 'నీల్ల'తో 'కాల్లు' కడుక్కుంటారు. 'కల్లు' తుడుచుకుంటారు, 'పల్లు' తోముకుంటారు. ణ-కారం పరిస్ధితి కూడా అలాగే తయారయింది. ఉదా: 'వీన', 'అరున' కలిసి 'వీన' నేర్చుకుంటున్నారు.

    మా తెలుగుతల్లికి మల్లెపూదండ ......

    ReplyDelete
    Replies
    1. మా కన్నతల్లికి మంగ"ళా"రతులు - అని మాత్రం అనిపించొద్దండి - వినలేం!

      Delete
  3. ళ-కారం జాడ దొరకని తెలుగులో - నాదీ ఇదే బాధ. ఈ మధ్యే ఓ కథ గా వెళ్ళగక్కేను.
    http://www.manandari.in/entries/september-2017/aksharaghosha-katha
    దివాలీ, పొంగల్ అని ఎవరైనా శుభాకాంక్షలు చెబితే ఒళ్ళు మండుకొస్తుంది నాకు.
    ళ కారం తో పాటు మరికొన్ని అక్షరాలు(ణ,ఖ, ఘ, ఝ) కూడా చాలా మంది పలకడం మానేశారు.

    ReplyDelete
    Replies
    1. ళ-కారమ్మీద కళకళలాడే కథ రాశారు - భళీ!

      Delete
  4. మీరిచ్చిన లింకులో మీ "అక్షరఘోష" కథ చదివాను మాధవ్ గారూ. భ్రష్టు పట్టిపోతున్న తెలుగు ఉచ్చారణ గురించిన మీ ఆవేదన కనబడింది. మీ బ్లాగ్ లో ఎలా గమనించలేదో తెలియడంలేదు.

    పైన మీరు చూపించిన ఒత్తులతో పాటు "భ", "ధ" వగైరాలకు కూడా విశ్రాంతి ఇచ్చినట్లే తోస్తోంది - ఎక్కువగా ఆడవాళ్ళు (మరి మహిళా టీచర్లు కూడా కొంతమందైనా ఇలాగే ఉండుంటారు. వీళ్ళే స్కూల్లో విద్యార్ధులకి, ఇంట్లో తమ స్వంత పిల్లలకి గురువులు కదా). కొంత సినిమాలు, ఇప్పుడు మీడియా కారణం అనిపిస్తోంది. "బార్యాబర్తల బందం" అంటూ సంభాషణలు చెప్పే నటీమణుల్ని చూసాం. టీవీ ఏంకర్లు కూడా ఏమీ తక్కువ తినలేదు. అసలు గట్టిగా మూడు నాలుగు కన్నా ఎక్కువ అక్షరాలున్న తెలుగు పదాలను పలకడానికి పడే అవస్థ చూస్తుంటే ఈ గతి పట్టిందా అని బాధ వేస్తుంది. అది కాక ఇంగ్లీష్ మోజొకటి. మాట్లాడేదాంట్లో 90 శాతం ఇంగ్లీష్ పదాలే. లేదా హిందీ పదాలు. అసలు అదే ఫేషన్ అనీ, స్టైల్ అనీ వాళ్ళ భ్రమనుకుంటాను. నిన్నటికి నిన్న ఒక తెలుగు ఏంకరిణి "ఆమ్" (హిందీ) అంటూ చాలాసార్లు అంది. తరువాత ఒక్కసారి "ఆమ్" అంటే .... అంది. "మామిడికాయ" అంటుందిలే అనుకున్నాను. కాదు, "ఆమ్" అంటే "మాంగో" అని చెప్పి మనకి జ్ఞానోదయం కలిగించింది. నాకైతే నిన్నటి తరం నటుడు కీ.శే. "సుత్తి" వీరభద్రరావు గారిలాగా చొక్కా చింపేసుకోవాలనిపించింది 🙁.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట వారు, కథ చదివినందుకు ధన్యవాదాలు. కొన్నేళ్ళుగా టివి, సినిమా మాధ్యమాలే కాక,ఇంటా బయటా కూడా ఇలాంటి భాష వినీ, వినీ విసుగెత్తి వ్రాశాను. ఈ మధ్య ఓ ఫంక్షను లో కొంత మంది పిల్లలు "వరవీనా మ్రిదు పానీ, వనరుహ లోచన రాని" అని పాడుతుంటే విని, దేశం కాని దేశం (యు.కె) లో మన పాట ఇంకా నేర్చుకుంటున్నందుకు ఆనందించాలో, లేక ఉచ్ఛారణా దోషాలతో పాడుతున్నందు బాధ పడాలో తెలియలేదు. ఇదొక క్రొత్త మాండలీకం అని సర్దుకుపోవాలేమో.

      Delete